Sajjala Ramakrishna Reddy: అలాంటి వాళ్ల గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది: సజ్జల

  • చిరంజీవిని ఎవరూ అవమానించలేదని సజ్జల స్పష్టీకరణ
  • ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావొచ్చని వ్యాఖ్య 
  • బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శలు
Sajjala says Chiranjeevi surprised sitting beside fraudsters

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి అంశంపై స్పందించారు. 

చిరంజీవిని ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టరని స్పష్టం చేశారు. చిరంజీవి గొప్ప సినిమా స్టార్ అని, కానీ ఆయన బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. చెడు ఆలోచనలు చేసే వారి గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. 

ఇక, పవన్ కల్యాణ్ కు రెండేళ్ల పాటు సీఎం పదవి ఇవ్వాలని జనసైనికులు కోరుకుంటున్నారని, కానీ చంద్రబాబు పవన్ ను 21 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారని సజ్జల వివరించారు. ఆ 21 మందిలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు 12 మంది వరకు ఉన్నారని, ఆ లెక్కన పవన్ తన సొంత మనుషులకు 10 మందికే టికెట్లు ఇప్పించుకోలిగారని వ్యాఖ్యానించారు. 

వీటిలోనూ ఇంకా కోత పడే అవకాశం ఉందని, చివరికి పవన్ కల్యాణ్ కూడా పిఠాపురం బరి నుంచి తప్పుకునే పరిస్థితులు ఏర్పడవచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న వంకతో పవన్ పిఠాపురానికి వీడ్కోలు పలికే అవకాశం ఉందని అన్నారు. 

అన్ని సీట్లపై తన పట్టు ఉండాలని భావించే చంద్రబాబు... పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను తప్పించి వర్మకు చాన్స్ ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పేర్కొన్నారు.

More Telugu News